“రుణమాఫీ అమలు విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను తప్పింది. గత ఎన్నికల్లో రూ.2 లక్షలోపు రుణాలు తీసుకున్న రైతులందరికీ రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కొర్రీల మీద కొర్రీలు పెడుతూ కొద్దిమందికే రుణమాఫీ చేయడం దుర్మార్గం. రాష్ట్రవ్యాప్తంగా 39 లక్షల మంది రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తుంటే… వారిలో 11 లక్షల మందికి మాత్రమే రుణమాఫీని వర్తింప జేస్తుండటం అన్యాయం. ఈ లెక్కన నూటికి 70 శాతం మంది రైతులకు రుణమాఫీ వర్తించకపోవడం దారుణం. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి(ఎస్ఎల్బీసీ) లెక్కల ప్రకారం రాష్ట్రంలో రైతులు తీసుకున్న రుణాల మొత్తం రూ.64 వేల కోట్లకుపైమాటే. అందులో 10వంతు మాత్రమే చెల్లించి సంబురాలు చేసుకోవడం హాస్యాస్పదం.”
“అయినా సిగ్గు లేకుండా సంబురాలు చేసుకునేందుకు కాంగ్రెస్ సిద్దపడటం సిగ్గుచేటు. ఏం సాధించారని సంబురాలు చేసుకుంటున్నారు? రబీ, ఖరీఫ్ లో చెల్లించాల్సిన రైతు భరోసా సొమ్ము ఎగ్గొట్టినందుకా? పంట నష్టపరిహారం ఇవ్వకుండా అన్నదాతలను గోస పెట్టినందుకా? రుణమాఫీలో కోతపెట్టి రైతులను మోసం చేసినందుకా? నూటికి 70 మంది రైతులకు క్షోభ మిగిల్చేలా నిర్ణయం తీసుకున్నందుకా? రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ లబ్ది కోసం కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న డ్రామా తప్ప రైతులపట్ల ఆ పార్టీకి ఏ మాత్రం చిత్తుశుద్ధి లేదు. మాకు అందుతున్న సమాచారం ప్రకారం రూ.లక్ష లోపు రుణాలు తీసుకున్న రైతుల సంఖ్య దాదాపు 39 లక్షలు. మిగిలిన వారికి రుణమాఫీ చేయకపోవడానికి కారణాలేమిటో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ముందుంచాలి.”
“గత ప్రభుత్వం రైతు బంధు పథకం కింద రెండు విడతల్లో కలిపి గత ఏడాది దాదాపు 70 లక్షల మంది రైతులకు రూ.15 వేల కోట్లు చేసింది. కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్రంలో 14 లక్షల కౌలు రైతు కుటుంబాలు, 10 లక్షలకుపైగా రైతు కూలీల కుటుంబాలున్నాయి. వీరితో కలిపి రైతు భరోసా కింద రైతులకు, కౌలు రైతులకు రూ.15 వేలు, రైతు కూలీలకు రూ.12 వేల చొప్పున చెల్లించాలంటే రూ.20వేల కోట్లకుపైగా నిధులు అవసరం. ఇచ్చిన హామీ ప్రకారం ఆ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయకుండా ఎగ్గొట్టి…అందులో మూడోవంతు నిధులను రుణమాఫీకి మళ్లించి గొప్పలు చెప్పుకుంటూ సంబురాలు చేసుకోవడం సిగ్గు చేటు.”
“ఇప్పటికే రుణమాఫీ అమలు కాకపోవడంతో అసలు, వడ్డీలు చెల్లించకలేక రాష్ట్రంలోని మెజారిటీ రైతులు డిఫాల్టర్ల జాబితాలో చేరారు. రైతులు డిఫాల్టర్లుగా మారడానికి గత ప్రభుత్వ మూర్ఖపు వైఖరే కారణం. సకాలంలో రుణమాఫీ చేసి ఉంటే రైతులు డిఫాల్టర్లుగా మారేవారు కాదు. ప్రభుత్వ తప్పిదానికి రైతులెందుకు మూల్యం చెల్లించాలి”.
“కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు రూ.2 లక్షల లోపు రైతులు తీసుకున్న అప్పులన్నింటికీ అసలు, వడ్డీతోసహా మొత్తాన్ని చెల్లించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా నిబంధనలు, కొర్రీల పేరుతో ఇబ్బంది పెట్టకుండా బ్యాంకుల నుండి తీసుకున్న ఆయా రుణాల మొత్తాన్ని చెల్లించి ‘డిఫాల్టర్ల’ జాబితా నుండి రైతులను తొలగించి కొత్తగా రుణాలు మంజూరు చేయించేలా చర్యలు తీసుకుని ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుని చిత్తశుద్ధి నిరూపించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా.”
–కేంద్ర హూంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్