Thursday, April 17, 2025
HomeNewsNationalఖనిజ రంగంలో ఆత్మనిర్భరత సాధిస్తాం : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ఖనిజ రంగంలో ఆత్మనిర్భరత సాధిస్తాం : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

కీలకమైన, తక్కువగా లభించే ఖనిజాల వెలికితీతలో అద్భుతమైన ఫలితాలు సాధించేందుకు విస్తృతమైన అవకాశాలున్నాయని.. అందుకే ఈ రంగంలో విడతలవారిగా సంస్కరణలు తీసుకొస్తూ.. దేశ ఆర్థికాభివృద్ధికి బాటలు వేస్తున్నామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. 2015లో కొత్తగా తీసుకొచ్చిన చట్టం ద్వారా సానుకూల మార్పులు కనబడుతున్నాయని ఆయన వెల్లడించారు.

సోమవారం ఢిల్లీలో జరిగిన నాలుగో విడత కీలకమైన, తక్కువగా లభించే ఖనిజాల (క్రిటికల్ మినరల్) గనుల నాలుగో విడత వేలాన్ని కేంద్రమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘కొత్త గనుల చట్టం వచ్చిన తర్వాత గనుల వేలానికి తీసుకున్న నిర్ణయంలో భాగంగా.. ఇప్పటివరకు 3 విడతల వేలం పూర్తయింది. నాలుగో విడత వేలం మొదలైంది. ఈ కొత్త చట్టం అమలులో రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తాం. ఈ రంగం ఆర్థికంగా రాష్ట్రాలకు లబ్ధిచేయడంతోపాటుగా వేలాది మందికి ఉపాధి కల్పిస్తుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలకు సంపూర్ణ సహకారం అందిస్తూ.. ముందడుగేస్తాం’ అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

ఖనిజాల తవ్వకం భారతదేశానికి చాలా కీలకమని, అందుకే ఈ రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం అన్నిరకాలుగా భాగస్వామ్య పక్షాలకు సంపూర్ణ సహకారం అందిస్తుందన్నారు. రానున్న రోజుల్లో అన్ని ఖనిజాల వెలికితీతలో.. మొదటి స్థానంలో ఉండేందుకు కేంద్రం సంపూర్ణ సహకారం అందిస్తుందన్నారు. గనులు తీసుకున్న వారు పనులను వీలైనంత త్వరగా పనులు ప్రారంభించాలని, గనుల మంత్రిత్వ శాఖ 24/7 అండగా నిలబడుతుందన్నారు.

గనుల తవ్వకంతోపాటు పర్యావరణ పరిరక్షణ రెండూ మాకు కీలకమైన అంశాలు. ఈ రెండింటికీ సమానమైన ప్రాధాన్యతను అందిస్తాం. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఎదిగేందుకు గనుల రంగంలో సాధించే ప్రగతి అత్యంత కీలకం. మోదీ గారు వచ్చాకే రాష్ట్రాలకు వారికి అందాల్సిన.. వాటా సరిగ్గా అందుతోంది. ఉదాహరణకు ఒక్క ఒడిశాలోనే.. ఏడాదికి రూ. 40వేల కోట్ల లబ్ధి చేకూరింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ దిశగా.. సహకరించాలి. అందరు భాగస్వామ్య పక్షాలు సహకరిస్తే.. ప్రతి 15 రోజులకో సంస్కరణ తీసుకొస్తాం. అందులో ఎలాంటి సందేహం లేదు’ అని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

కీలకమైన ఖనిజాలను మనం అనుకున్నంతగా వెలికితీయలేకపోయామని.. రాగి వంటి ఖనిజాలను మన దేశీయ అవసరాలకోసం దిగుమతి చేసుకుంటున్న విషయాన్ని కేంద్రమంత్రి గుర్తుచేశారు. ఈ దిశగా ప్రత్యేకమైన దృష్టి సారించి.. భవిష్యత్తులో.. ఎగుమతి చేసే స్థాయికి ఎదుగుతామనే విశ్వాసం ఉందన్నారు. గనుల రంగం.. యువతకు ఉపాధితోపాటు, సాంకేతికతకు పెద్దపీట వేస్తోందన్న కిషన్ రెడ్డి.. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం.. గనుల రంగంలో భారతదేశ సామర్థ్యాన్ని సద్వినియోగపరచుకుంటూ ఇందుకు ఉన్నటువంటి అన్ని అవకాశాలను సద్వినియోగ పరుచుకుంటామన్నారు.

ఈ కార్యక్రమం సందర్భంగా.. ‘స్కీమ్ ఫర్ పార్షియల్ రీయింబర్స్‌మెంట్ ఆఫ్ ఎక్స్‌ప్లొరేషన్ ఎక్స్‌పెన్సెస్ ఫర్ హోల్డర్స్ ఆఫ్ ఎక్స్‌ప్లొరేషన్ లైసెన్స్’ పుస్తకాన్ని కేంద్రమంత్రి ఆవిష్కరించారు. అనంతరం.. 2 కంపెనీలకు మైనింగ్ ఎక్స్ ప్లొరేషన్ లైసెన్స్ లను, ఈ రంగంలో మంచి ఫలితాలు సాధిస్తున్న కంపెనీలు R&D సంస్థలకు ప్రోత్సాహకాలను అందజేశారు.

అంతకుముందు బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రి సతీశ్ దూబే మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం ఈ రంగంలో చేపడుతున్న సంస్కరణలకు అందరూ సహకారం అందించాలన్నారు. గనుల శాఖ కార్యదర్శి వీఎల్ కాంతారావు మాట్లాడుతూ.. గనుల రంగం గణనీయమైన సంస్కరణలు సాధిస్తోందని తెలిపారు. గతేడాది.. దేశవ్యాప్తంగా.. మెటల్ అండ్ మైనింగ్ రంగానికి ఎక్కువ డివిడెండ్ దొరికింది. మినరల్ రంగం అభివృద్ధికి ఇదొక సంకేతమని సెక్రటరీ వీఎల్ కాంతారావు పేర్కొన్నారు. విదేశాల్లో లిథియం బ్లాక్స్ తీసుకున్నామని.. లిథియం వెలికితీతలోనూ ప్రగతి సాధిస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రి శ్రీ సతీశ్ చంద్ర దూబే, గనుల శాఖ కార్యదర్శి శ్రీ వీఎల్ కాంతారావు, గనుల శాఖ అదనపు కార్యదర్శి శ్రీ సంజయ్ లోహియా, గనుల రంగ ప్రముఖులు, స్టార్టప్ కంపెనీల ప్రతినిధులు, ఈ రంగంలో పరిశోధనలు చేస్తున్న సంస్థల ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments